
హైదరాబాద్, వెలుగు: ఉద్యోగాల భర్తీ విషయంలో హరీశ్ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మండిపడ్డారు. దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. గాంధీ భవన్ లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో లక్షా 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారని, అదే నిజమైతే ఆ వివరాలను బహిరంగంగా ఆధారాలతో సహా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారని, పదేండ్లలో ఎన్ని జాబ్‌లు ఇచ్చారో చెప్పాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల కాలంలోనే 58,868 ఉద్యోగాలు ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు నిరుద్యోగులను కలిసిన హరీశ్ రావు, అధికారంలో ఉన్నప్పుడు వాళ్లకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆరోపించారు.